హుజురాబాద్ ఉపఎన్నిక అప్పుడే….!
తెలంగాణలో దుబ్బాక ఘనవిజయం తర్వాత మంచి జోష్ మీదున్న బీజేపీ ఈసారి హుజూరాబాద్ విజయంపై సీరియస్ గా దృష్టి సారించింది. హుజురాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక తేదీ ఖరారు కాకముందే… అన్ని పార్టీలు హుజురాబాద్లో గెలిచేందుకు ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టాయి. అలాగే తీవ్ర స్థాయిలో ప్రచారం కూడా చేస్తున్నాయి. ఉద్యమంలో ఉన్న నాయకులకు అన్యాయం జరిగిందనే… సెంటిమెంట్ ను ఈటల రాజేందర్ ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. అటు టీఆర్ఎస్…పార్టీ అయితే సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న బీజేపీలోకి ఈటల ఎందుకు వెళ్లారంటూ? ప్రశ్నిస్త్రాలను సంధిస్తుంది. అంతేకాకుండా… ఈటలకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుసరించిన ఫార్ములాను హుజురాబాద్లో అమలు చేస్తారని కూడా టాక్ నడుస్తోంది. కాగా ఈ రెండు పార్టీలు ఇలా ఉంటే… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి అన్నీ తానై హుజురాబాద్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాడు.
అదేవిధంగా 2018 ముందస్తు ఎన్నికల్లో 30వేలకు పైచిలుకు ఓట్లతో ఓటమి పాలైన కౌశిక్ రెడ్డి.. ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని సవాల్ విసురుతున్నాడు. అయితే ప్రచారం బాగానే ఉంది.. కానీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు అన్ని పార్టీల నాయకులు. అంతేకాకుండా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే… సెప్టెంబర్ నెలలో హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందని సమచారం. సెప్టెంబర్ వరకు కరోనా పరిస్థితులు మెరుగు పడతాయనే భావనలో ఉన్న ఎన్నికల సంఘం… ఆ నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక వచ్చే లోపు 80 శాతం వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేయాలని కేసీఆర్ సర్కార్ కూడా భావిస్తోంది. కాగా… హుజురాబాద్ ఉపఎన్నికకు ఇంకా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయని విషయం తెలిసిందే.