హస్తినలో ఏపీ సీఎం వైఎస్ జగన్…. బిజీ బిజీ పర్యటనలు
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. పలు ప్రాజెక్టులు, అభివృద్ధి వికేంద్రీకరణ, విభజన హామీలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్ రాత్రి వరకు సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవ్దేకర్లతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు.
అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ నిధులు, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, ప్రత్యేక హోదా వంటి పలు విభజన హామీలు, వైద్య కళాశాలలకు అనుమతులు తదితర అంశాలపై మంత్రులతో జరిపిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్షాతో ఆయన నివాసంలో రాత్రి 9గంటల నుంచి 10.35 వరకు సమావేశమై, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. మంచి వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో సీఎం జగన్.. అమిత్షా దృష్టికి తెచ్చిన అంశాలలో పలు రాజకీయ అంశాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం అందుతుంది. అంతేకాకుడాం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు మరో ఇద్దరు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో ముఖ్యమంత్రి జగన్ నేడు సమావేశం కానున్నారు.