స్టాలిన్, ఉదయనిధిలకు కమలహాసన్ శుభాకాంక్షలు…
తమిళనాడులో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మొన్నటి వరకు కేవలం సినీ గ్లామర్ కే ఓటెత్తిన జనం ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. తమకు అనుకూలమైన, సమీపస్తులైన సరైన నాయకుడిని ఎన్నుకొనేలా తమిళ ప్రజలు ఓటేశారు. అందుకు నిదర్శనం స్వయంగా పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెల్చుకోలేని కమలహాసన్ ప్రత్యక్ష సాక్ష్యం.
ముఖ్యంగా స్వర్గీయ కరుణానిధి తనయుడు స్టాలిన్ తొలిసారి డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి, తమిళనాడులో విజయ బావుటా ఎగురవేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. అలానే ఇప్పటి వరకూ నటన, చిత్ర నిర్మాణానికే పరిమితమైన స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, వినూత్నంగా ప్రచారం చేసి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్ ఈ తండ్రీ కొడుకులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అయితే సరిగ్గా మూడేళ్ళ క్రితం కమల్ హాసన్ సొంత పార్టీ మక్కల్ నీది మయ్యంను పెట్టాడు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆశలతో తన అభ్యర్థులను నిలబెట్టుకున్నాడు. వాళ్ళెవరూ గెలవలేదు సరికదా, కమల్ హాసన్ కూడా ఓటమి పాలయ్యాడు. అయినా… డీఎంకే విజయాన్ని స్వాగతిస్తూ కమల్ హాసన్… కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి అభినందించడాన్ని కోలీవుడ్ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.