సేవలోంచి పుట్టిందే ఆల్ ఎబౌట్ లవ్….!

ఎంతో కష్టపడి ఓ స్థాయికి చేరుకున్న ప్రముఖులు ఆ తర్వాత సమాజానికి ఎంతో కొంత తమ వంతు సాయం అందించాలని కోరుకుంటుంటారు. అలాంటి వారిలో బుట్టుబొమ్మ పూజాహెగ్డే కూడా ఉన్నారు. ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా భావించి పరుస కోసం సేవ చేయడం అంటే అరుదుగా దక్కే వరం. అలా వ్యక్తిగతంగా తనవంతు సాయాన్ని ఆపన్నులకు అందిస్తూ ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు ‘ఆల్ ఎబౌట్ లవ్’ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సమాజం తనకు ఇచ్చిన దానిని తిరిగి ఇవ్వడంలో భాగంగానే ఈ సేవను తాను భావిస్తున్నట్లు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వెల్లడించింది. అయితే తాజాగా పూజా మీడియాతో మాట్లాడుతూ తన ఛారిటీ సంస్థపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవేమంటే… తన నటనను అభిమానించి, ఆదరించే ప్రజలు ఈరోజు తనకో స్థానాన్ని కల్పించారని, అలాంటి వారికి తిరిగి తాను ఏదో ఒక చిన్నసాయమైనా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఛారిటీని ప్రారంభించానని పూజా స్పష్టం చేసింది. అలాగే ప్రజలు ఇచ్చిన ఆ స్థానాన్ని టేకిట్ గ్రాంట్ గా తాను తీసుకోలేనని, సమాజానికి తిరిగి మన వంతు సాయాన్ని పెద్దగానో, చిన్నగానో చేసేలా ఇతరులను ప్రేరేపించాలన్నదే తన ఆలోచన అని కూడా వివరించారు. మనస్ఫూర్తిగా మనం చేసే సేవతో సమాజంలో మార్పు తప్పక వస్తుందనే నమ్మకం తనకుందని కూడా పూజ వివరించారు.

అంతేకాకుండా ‘ఆల్ ఎబౌట్ లవ్’ ఛారిటీ సంస్థను ప్రారంభించక ముందు కూడా పూజా హెగ్డే పలు సేవా కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. కరోనా సమయంలో వందమంది రోజువారి కూలీలకు ఒక నెలకు సరిపడా నిత్యావసరాలను అందించారు. అలానే క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులకు మందులు ఇవ్వడం, కుటుంబ పెద్ద మంచాన పడిన వారికి బాసటగా నిలవడం చేశారు. తన ఫౌండేషన్ ద్వారా మంగళూర్ లోని దివ్యాంగ పిల్లలకు కృత్రిమ అవయవాలకై పూజా హెగ్డే కొంత మొత్తాన్ని విరాళం అందించడం వారి సేవానిరతికి నిదర్శనంగా చెప్పవచ్చు. కాగా ఇక పూజాహెగ్డే సినిమాల విషయానికి వస్తే, ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ కు రెడీ అయింది. అలాగే పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ఫైనల్ దశలో ఉంది. ‘ఆచార్య’ మూవీ సెట్స్ పై ఉండగానే, తమిళ సినిమా ‘బీస్ట్’ షూటింగ్ ప్రస్తుతం చెన్నయ్ లో జరగుతోంది. ఇవి కాకుండా పూజా హెగ్డే ఇప్పుడు పలు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ చాలా బిజీగా గడుపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *