సెప్టంబర్ కి బిగ్ బాస్ 5 వాయిదా…!
బుల్లితెర సంచలనం ‘బిగ్ బాస్’. అయితే బిగ్ బాస్4 బ్రహ్మాండంగా సక్సెస్ కావడంతో ఇక ‘బిగ్ బాస్ 5’పై నిర్వహకులు దృష్టి సారించారు. ఈ సీజన్ ను కూడా అనుకున్న టైమ్ కే ఆరంభించాలని భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తో ఈ ఏడాది కూడా ఆలస్యంగానే మొదలవుతుందనే టాక్ వినిపిస్తుంది.
అయితే గత సంవత్సరం కరోనా, లాక్ డౌన్ వల్ల కొన్ని నెలలు ఆలస్యంగా మొదలైంది ‘బిగ్ బాస్4’. పోటీదారులను ఎంపిక చేసి వారిని మూడు వారాలపాటు క్వారంటైన్ చేసి మరీ ఆరంభించారు. ఇక ఈ ఏడాది జూన్ నెలాఖరు నుంచి ‘బిగ్ బాస్5’ను మొదలెట్టాలని భావించారు. పోటీదారులకు సంబంధించి ఎంపిక కూడా మొదలు పెట్టారు. ఎప్పటివలెనే చిన్నస్థాయి సెలబ్రెటీలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, యూట్యూబ్ స్టార్స్, పేరున్న సాంకేతిక నిపుణులు ‘బిగ్ బాస్5’లో చోటు దక్కించుకోబోతున్నారు.
అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ తో ఈ ఏడాది కూడా ‘బిగ్ బాస్’ షో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఆరంభించి డిసెంబర్ కి ముగించాలనుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. కాగా ఈ ‘బిగ్ బాస్ 5’కి కూడా నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. మరి సెప్టెంబర్ కు అయినా ఈసారి ఆరంభం అవుతుందా? లేకా మరింత వాయిదా పడుతుందా? అనేది వేచి చూడాల్సిందే.