సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈనెల 14వ తేదీన జగన్ తిరుపతి ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అందుకు సంబంధించి వైసీపీ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అనూహ్యంగా ఆయన సభ రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. తిరుపతి ఓటర్లకు ఆయన తాజాగా లేఖ రాశారు. ఈనెల 14వ తేదీన తిరుపతి బహిరంగ సభకు తాను వస్తానని ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే అని ఆయన పేర్కొన్నారు. ఆ సభకు రావడం ద్వారా మీ ఆత్మీయ అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని భావించానని అయితే తాజా కరోనా హెల్త్ బులిటెన్ చూసిన తర్వాత ఈ లేఖ రాస్తున్నానని వివరించారు.
అదేవిధంగా దేశంతో పాటు రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని, తాజాగా విడుదలైన బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 31892 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో 2765 మంది కరోనా పాజిటివ్ తేలిందని పేర్కొన్నారు. అందులో చిత్తూరు జిల్లాలో 496 కేసులు నమోదయ్యాయని అలాగే నెల్లూరు జిల్లాలో కూడా 292 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ కోసం వ్యక్తిగతంగా బహిరంగ సభకు హాజరు అయితే తన మీద అభిమానంతో ఆప్యాయతతో వేలాది మంది తరలి వస్తారని అయితే మీరందరూ మాకు ముఖ్యమేనని మీ ఆరోగ్యం ఆనందం ముఖ్యం అని వెల్లడించారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత గల స్థానంలో ఉన్న అన్నగా, తమ్ముడిగా తిరుపతిలో బహిరంగ సభ రద్దు చేసుకుంటున్నానని ఆయన ప్రకటించారు.
అంతేకాకుండా తాను వ్యక్తిగతంగా వచ్చి ప్రచారం చేసి మిమ్మల్ని ఓటు అడగకపోయినా మన అందరి ప్రభుత్వం మీ పిల్లల కోసం మన అవ్వా, తాతల కోసం అక్కా,చెల్లెళ్ల కోసం మన గ్రామాలు పట్టణాలు కోసం ఏం చేసింది అన్నది మీ అందరికీ వివరిస్తూ మీకు కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో తన సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశాను అంటూ ఆయన పేర్కొన్నారు. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి నిండు మనసుతో గుండె నిండా ప్రేమతో ఓటు రూపంలో ఇస్తారని మనందరి అభ్యర్థి నా సోదరుడు గురుమూర్తిని గతంలో బల్లి దుర్గాప్రసాద్ అన్నకు ఇచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువగా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అందిస్తారని ఆశిస్తున్నానని అంటూ వైఎస్ జగన్ లేఖ ద్వారా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *