సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఆపడం దురదృష్టకరం: సజ్జల
తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షల్లో భాగంగా ఏపీ- టీఎస్ బోర్డర్ లో చాలా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల విషయంలో నిబంధనలు మరింత కఠినం చేసింది. తెలంగాణ బోర్డర్ లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను ఆపివేయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రజల గురించి ఆలోచించడం సహజమేనని… హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్ లైన్స్ పెట్టడం దుదృష్టకరమని అన్నారు. అయితే ఆ గైడ్ లైన్స్ ను పాటించడం కష్టమని అన్నారు. అంబులెన్స్ ను ఆపడం దురదృష్టకరమని, గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో రాష్ట్రంలో మౌళిక వసతులు అభివృద్ధి చేయలేదని, దీంతో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లో వైద్యసదుపాయాలు తక్కువే అని వెల్లడించారు. బెంగళూరు, చెన్నై నగరాలకు వైద్యం కోసం వెళ్తున్నారని, కానీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.