సబిత, సుధీర్ రెడ్డి పై మండిపడ్డ మధు యాష్కీ..
తెలంగాణ కాంగ్రెస్ లో ఓ రకమైన అలజడి మొదలైంది. గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్… పలు విషయాలను ప్రస్తావించారు. కేసీఆర్ సర్కార్ అన్ని విధాలుగా విఫలం అయ్యిందని మండిపడ్డారు. అలాగే బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ముఖ్యంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేర్లను ప్రస్తావించిన ఆయన.. కాంగ్రెస్ బిక్షతో సుధీర్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడని అన్నారు. అలాగే.. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అయ్యింది కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే అని.. సుధీర్ రెడ్డి ఇప్పుడు కోట్లకు ఎలా పడగలెత్తాడని ఆయన ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా త్వరలో నీ బండారం బయట పెడతామని హెచ్చరించారు.
అంతేకాకుండా మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మధుయాష్కీ గౌడ్. మహిళ అని కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసిందని.. కానీ.. సిగ్గు లేకుండా పార్టీ మారారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ దయతో మంత్రి అయ్యి.. పార్టీ మారేందుకు సిగ్గు ఉండాలి అంటూ ఆగ్రహానికి లోనయ్యారు. కాగా కాంగ్రెస్ కార్యకర్తలపై చేయి వేస్తే చేతులు విరగ్గొడతాం అంటూ హెచ్చరించిన ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని.. తాను ప్రచార కమిటీ చైర్మన్ కాదని.. సామాన్య కార్యకర్తను అంటూ తన ప్రసంగం సాగింది. మొత్తానికి ఈరోజు గాంధీభవన్ సమావేశం వాడీవేడిగా సాగిందన్నమాట.