వైఎస్ షర్మిల ఖమ్మం సభకు షాక్.. పోలీసుల నోటీసులు

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మరోపార్టీతో బరిలోకి దిగుతున్న వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో కరోనా తీవ్రత రోజురోజుకీ ఉదృతం అవుతుంది. దీంతో జీవో 68, 69 ప్రకారం షర్మిల సభకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు పోలీసులు.
అయితే నిబంధనలు పాటిస్తూ సభ జరుపుతామని షర్మిల బృందం వెల్లడించినా.. ఇలా జరగడంతో సభపై షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో పార్టీ స్థాపించాలని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిల… ఈనెల 9న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది కూడా. కాగా ఇప్పుడు ఆ సభ నిర్వహణపై అనుమానాలు అలముకున్నాయి. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో సభకు షర్మిల టీం ఈ మధ్య పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. ఇంతలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో పోలీసు శాఖ పునరాలోచనలో పడింది. దీంతో పోలీసులు షర్మిల బృందానికి నోటీసులు జారీ చేశారు. జీవో 68, 69 ప్రకారం ఖమ్మం జిల్లా ఇన్చార్జి లక్కినేని సుధీర్ కు నోటీసులు పంపారు. కానీ.. కరోనా మార్గదర్శకాలు, అన్ని నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహిస్తామని షర్మిల బృందం పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. మరి సభ జరుగుతదా? లేదా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్ షర్మిల జరపబోయే ఖమ్మం సభ ద్వారా తన పార్టీ పేరు, గుర్తు ప్రకటించాలని చూస్తున్నట్లు ఇప్పటికే అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.