వచ్చే ఎన్నికల్లో మోడీ వర్సెస్ దీదీ.. ఢిల్లీ వర్గాల్లో ఆసక్తికర చర్చ….!
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐదురోజులుగా ఢిల్లీటూర్లో చాలా బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై పోరాటంలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశమైన మమత… తమ మధ్య సమావేశం పూర్తి సానుకూల దోరణిలో జరిగిందని అన్నారు. అలాగే ఈ సమావేశం తాలూకూ ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయని కూడా తెలిపారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బంపర్ విజయం అందుకున్న తర్వాత తొలిసారిగా మమత.. సోనియాతో సమావేశం నిర్వహించడం విశేషం. ఢిల్లీలో వరుసగా విపక్ష నేతలతో మమత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో… మమత కూడా నేతలతో సమావేశం కావడం, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది.
అదేవిధంగా పెగసస్ స్పైవేర్ కాంట్రవర్సీ, కోవిడ్-19 పరిస్థితి.. తమ మధ్య చర్చకు వచ్చినట్లు మమత వెల్లడించారు. పెగసస్ కాంట్రవర్సీపై కేంద్రం ఎందుకు చర్చకు సిద్ధం కావడం లేదని ఆమె అన్నారు. పార్లమెంటులో ప్రజాసమస్యలపై చర్చ జరగకపోతే.. ఇంకెక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం సభలో సమాధానమిచ్చేవరకూ, విపక్షాలు.. సభను జరగనివ్వరని అన్నారు మమత. అలాగే ఈరోజు ఎన్సీపీ నేత పవార్ సహా పలువురు కీలక నేతలతో మమత భేటీ కానున్నారు మమతా.2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు అనుసరించాల్సిన వ్యూహాలను.. ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా మమత ఢిల్లీ పర్యటనపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరితో మమత వరుసగా సమావేశం అవుతుండటం… సోనియా, కేజ్రీవాల్లను కూడా కలవడం… ఇప్పుడు శరద్ పవార్తో కూడా సమావేశం అవుతుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే నడుస్తోంది. అంతేకాకుండా విపక్ష కూటమికి ఎవరు మద్దతిచ్చినా ఓకే అంటున్నారు. పరిస్థితి చూస్తే 2023లో కేంద్రంలో మోడీ వర్సెస్ మమత అయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇంతకీ మమతా బెనర్జీ యాంటీ మోడీ ఫ్రంట్ను ముందుండి నడిపించగలరా? విపక్షాల ఐక్యత సాధ్యం అవుతుందా.? ఆమె పిలుపుతో విపక్షాలన్నీ ఒకే తాటిపైకి వస్తాయా? అంత శక్తి దీదీకి ఉందా? అనే చర్చ కూడా ఇప్పుడు రాజకీయ నేతల్లోనూ.. వర్గాల్లోనూ బయలుదేరింది. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.