లూసిఫర్ రీమేక్ లో వరుణ్ తేజ్..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. 20 రోజుల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండటంతో చిరంజీవి తర్వాతి సినిమాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి ఇప్పటికే మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్కు సైన్ చేశారు. తమిళ మూవీ ‘వేదాళం’ వాటిలో ఒకటి కాగా మరొకటి మలయాళం హిట్ సినిమా ‘లూసిఫర్’. దీంతో ఆచార్య తర్వాత ఈ సినిమాలపై మెగాస్టార్ దృష్టి సారించినట్లు సమాచారం అందుతుంది. అయితే తమిళ రీమేక్ ‘లూసిఫర్’ సినిమాని ప్రకటించినప్పటి నుంచి దానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
అయితే ‘లూసిఫర్’లో మెగాస్టార్ కి చెల్లిగా స్వీటీ అనుష్క నటించనుందనే వార్త ఈ మధ్య తెగ హడావుడి చేసింది. అలాగే యంగ్ పోలిటిషియన్గా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నారనే విషయంపై కూడా టాక్ నడిచింది. ఇది పుకారు వార్తేనంటూ విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు కూడా. మరి తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ను ఈ మూవీలో నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. మెగాస్టార్ సినిమాలో ఏ పాత్ర చేయడానికైన మెగా హీరోలు ఆసక్తిగా ఉంటారు. దీంతో ఈ సినిమా వరుణ్ తేజ్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజున లూసిఫర్ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం అందుతుంది. మరి మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.