లాక్ డౌన్ పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….
తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ విధిస్తారని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. అయితే.. ఈ విషయంపై ఈరోజు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో ఇక లాక్ డౌన్ ఉండదని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ తెలిపారు.
అదేవిధంగా పరిశ్రమల మూసివేత కూడా ఉండబోదని.. తొందరపాటు నిర్ణయాలు ఉండవని అన్నారు. అలాగే ప్రజలెవరూ భయపడవద్దని.. పెండ్లివంటి వేడుకలకు జనం తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అలాగే గత సంవత్సరం లాక్డౌన్తో ఆర్థికంగా చాలా నష్టపోయామని, సెల్ఫ్ కంట్రోల్… సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యమని మరోసారి వివరించారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేయడం బాధాకరమేనని.. స్కూళ్ల మూసివేత తాత్కాలికమని అన్నారు. కరోనా వ్యాక్సిన్ మన చేతిలో లేదని… మన వాటా మనకు వస్తుందని వివరించారు. అలాగే తెలంగాణ ఆర్థిక ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. అప్పులు పెరగలేదని… లేని కథలు పుట్టీయ వద్దని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. అప్పులు తీసుకోవడంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని అన్నారు కేసీఆర్.
కాగా ఈరోజుతో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్. అయితే ఈ నెల 15న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు.. మొత్తంగా 9 రోజుల పాటు నిర్వహించారు. మొత్తం 47.44 గంటల పాటు సభ కార్యకలాపాలు కొనసాగాయి. ఈ నెల 18న బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు. సభలో సీఎం కేసీఆర్ పీఆర్సీపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సమావేశాల్లో 75 మంది సభ్యులు ప్రసంగించగా.. మొత్తం నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది.