రోడ్డుకెక్కిన బెజవాడ టీడీపీ రాజకీయం

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు టీడీపీకి చాలా తంటాలు తెచ్చిపెట్టాయి. బెజవాడ టీడీపీలో ప్రముఖ నాయకుల విభేదాలు రోడ్డుకెక్కాయి. విజయవాడ టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోవడంతో తీవ్ర వాగ్వాదం నెలకొంది. తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్మీరా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన గురించి మాకు కనీసం సమాచారం ఇవ్వలేదని, రూట్ మ్యాప్ మార్చడానికి కేశినేని ఎవరని ఆ నాయకులంతా నానీపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.
అంతేకాకుండా ‘చంద్రబాబు రోడ్షోలో కేశినేని పాల్గొంటే.. మేం పాల్గొనం. మాకు ఏ గొట్టం గాడు అధిష్టానం కాదంటూ’ వారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీని కుల సంఘంగా మార్చాలని కేశినేని అనుకుంటున్నారని, దమ్ముంటే కేశినేని రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీచేసి తిరిగి గెలవాలని తీవ్రంగా స్పందించారు. అసలు కేశినేని చెప్పుచేతల్లో బీసీలు బతకాలా? కేశినేని నాని చేసేవన్నీ చీకటి రాజకీయాలు అంటూ బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్మీరా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాగా బెజవాడ టీడీపీలో ముఖ్య నాయకులు రెండు వర్గాలుగా విడిపోవడం తెలుగు తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేస్తుంది. కేశినేని నాని వెంట గద్దె రామ్మోహన్ ఉంటన్నారు. బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్మీరా, పట్టాభి తదితరులు పూర్తిగా వీరికి దూరం కావడం విశేషం.
అయితే అసలు రచ్చకు కారణం ఏమిటంటే.. బీసీ వర్గానికి చెందిన గుండారపు హరిబాబు కుమార్తె పూజితకు ఇచ్చిన టిక్కెట్ను కేశినేని నాని మార్చారు. ఇదే విషయంలో బుద్ధా, నాగుల్ మీరాలు ఎంత పట్టుపట్టినా ఎంపీ కేశినేని మాట వినిపించుకోలేదని తెలుస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన కొట్టేటి హనుమంతరావు భార్య టికెట్ విషయంలో కూడా అదే జరిగినట్లు సమాచారం అందుతుంది. బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇప్పించుకోలేక పోయామని తాజాగా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ టీడీపీ నేతలు ఇంతలా రచ్చకెక్కడానికి కారణం ఇలాంటి లోలోపల జరిగిన పరిణామాలేనని స్పష్టమౌతుంది.