రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. అదేమంటే… ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాలోని ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్ నుంచే అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ.26 వేల కోట్లు రెడీగా ఉంచారని కూడా స్పష్టం చేశారు.
అయితే ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని మంత్రి హరీష్ రావు వివరించారు. మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి కావాలని అన్నారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశించారు. టార్ఫలీన్, గన్ని బ్యాగుల కొరత, ట్రాన్స్పోర్టు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కూడా తెలిపారు. కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రం ఇంచార్జీ అధికారి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా హరీష్ రావు వివరించారు.