రాసలీలల ఆరోపణలతో కీలక మంత్రి రాజీనామా..
ఎంతటి వారలైనా కాంతా దాసులే అనేది నానుడి. అందుకు మంత్రి అతీతుడు కాదన్నది జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తుంది. కర్నాటక బీజేపీ ప్రభుత్వంలో కీలకమైన శాఖకు మంత్రిగా పని చేస్తున్న వ్యక్తి లైంగిక పరమైన ఆరోపణలు రావడంతో రాజీనామా చేయక తప్పలేదు. అసలేం జరిగింది అంటే.. కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి రమేష్ జార్కిహొళి ఓ మహిళతో రాసలీలలు సాగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూసింది. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని తన మొహాన్ని మార్ఫ్ చేశారని మంత్రి పేర్కొన్నప్పటికీ రాజీనామా మాత్రం చేయక తప్పలేదు. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. ఆయన రాజీనామా లేఖను సీఎం బీఎస్ యడియూరప్పకి పంపారు. వెంటనే సీఎం రాజీనామాను ఆమోదించారు.
అయితే తన వద్దకు ఒక పనికి అనుమతి ఇప్పించమని వచ్చిన ఓ మహిళను మంత్రి రమేష్ జార్కిహొళి లైంగికంగా వాడుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. బెంగళూరులోని ఆర్టీ నగర్ లో నివాసం ఉండే ఆ యువతి రాష్ట్రంలోని డ్యామ్లను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. అందుకోసం అనుమతులు కావాలంటే తనకు అది కావాలని ఆ మంత్రి లైంగికంగా వాడుకున్నాడని తెలుస్తోంది. ఈ వీడియోను ఆధారంగా చేసుకుని బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త, పౌర హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేష్ కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు న్యాయం చేయించాలని తనను కోరిందని ఆ సందర్భంగా ఆయన తెలిపారు.
కాగా ఈ మంత్రిగారు హెచ్ డీ కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి జంప్ అయిన ఆయన చాలా మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత కలిగిన నీటిపారుదల శాఖకు మంత్రి అయ్యారు. మరి టైం బాగోలేకపోతే ఓడలు బండ్లవుతాయంటే ఇదేమరి.