రసవత్తరంగా బెజవాడ సెంట్రల్ పాలిట్రిక్స్
ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీ నేతలకు పెద్ద తలకాయ నొప్పిలా మారాయి. పంచాయతీ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చవిచూసిన తర్వాత టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. అయితే తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నానికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తలు కేశినేని నానీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో విజయవాడ టీడీపీలో కలకలం రేగింది. అయితే ఈ వివాదానికి మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడిన అలజడే అని తెలుస్తోంది. ముఖ్యంగా విజయవాడలోని కేశినేని నానీకి సంబంధించిన కార్యాలయం ఎదుట కార్యకర్తలు ఆందోళన చేయడం కాస్త ఆలోచించాల్సిన విషయంగా ప్రత్యర్థి పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది.
ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టికెట్ల పంచాయతీ టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇదే సమయంలో విజయవాడ 34వ డివిజన్ అభ్యర్థి మార్పుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో ఒక్కసారిగా ఎంపీ కేశినేని నాని కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే 34వ డివిజన్ టికెట్ తమకు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలమని పలువురు టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేయటం కొసమెరుపు.