మున్సిపల్స్ పై మరోసారి ఎస్ఈసీ రూట్ మ్యాప్..

ఆంధ్రప్రదేశ్ లో మార్చి 10వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్లు కూడా కొట్టివేయడంతో ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లైంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రెడీ అవుతుంది . ఈసారి ఎన్నికల్లో భాగంగా కూడా ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించనున్నారు.
అయితే ఈ మున్సిపల్ ఎన్నికలపై అధికారులకు మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్. రేపు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎస్ఈసీ పర్యటిస్తుండగా, ఫిబ్రవరి 28వ తేదీన పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. అదే విధంగా మార్చి 1వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. కాగా గ్రామపంచాయతి ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికలను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా ఇదివరకు ఏ ఎన్నికల కమిషన్ తిరగని విధంగా ఈ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుగుతుండటంతో అన్ని పార్టీలకు ఏమోగానీ అధికార పార్టీకి మాత్రం మింగుడు పడని విషయంగా మారిందన్నది చెప్పకనే చెప్పవచ్చు.