ముగిసింది అనుకుంటే మళ్లీ రాజుకుంటున్న.. ఆ మఠాధిపతి ఎంపిక…
ఆంధ్రప్రదేశ్ లోని బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపికపై మళ్లీ వివాదం రాజుకుంటుంది. మఠాధిపతి ఎంపికపై హైకోర్టులో రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం అందుతుంది. తనపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఒప్పుకొనే లాగా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే మఠాధిపతిగా ఎంపికైన వెంకటాద్రి స్వామి నియామకాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం అందుతుంది. అలాగే వీలునామా ప్రకారం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ అధికారులు మఠాధిపతిని ప్రకటించారని మారుతి మహాలక్ష్మమ్మ పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
అయితే ఈమధ్య కాలంలో బ్రహ్మంగారిమఠంలో మఠాధిపతి వ్యవహారం పెద్ద రచ్చకే దారితీసింది. పలు దపాలుగా చర్చల తర్వాత మఠాధిపతి నియామకం ఓ కొలిక్కి వచ్చింది. అంతగా మఠాధిపతులు చర్చలు జరిపినా పరిష్కారం కాని సమస్య… మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సారథ్యంలో కందిమల్లయ్యపల్లి సంస్థానం పుర ప్రజల సహకారంతో మఠాధిపతి ఎంపికకు పరిష్కారం లభించింది. పీఠాధిపతి ఎంపికపై ఏకాభిప్రాయానికి వచ్చి.. దివంగత పీఠాధిపతి మొదటి భార్య మొదటి కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠాధిపతిగా ఎంపికకు సయోధ్య కుదిరర్చారు. కాగా బ్రహ్మంగారిమఠం ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండవ కుమారుడు వీరభద్రయ్య నియామకం కాగా.. వీరిరువురి తర్వాత మఠాధిపతిగా మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం ఇవ్వాలని.. ఇరు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థుల సమక్షంలో జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు.