మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ అప్పుడే….!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అదెలా అంటే… 2017 నుంచి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా రామాయాణ గాథను త్రీడీలో మూడు భాషల్లో, మూడు భాగాలుగా నిర్మించాలని కలలు కంటున్న విషయం తెలిసిందే. అయితే సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకునే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నితేశ్ తివారి, రవి ఉద్యావర్ భుజానకెత్తుకున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో రావణాసురుడి పాత్రను హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకునే నటిస్తారనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది కూడాను.
అదేవిధంగా ఈ మేగ్నమ్ ఓపస్ మూవీలో రాముడి పాత్రను ప్రిన్స్ మహేశ్ బాబు చేయబోతున్నాడనీ గత కొంతకాలంగా టాక్ నడుస్తోంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన మధు మంతెనను ఇదే విషయంపై అడిగితే ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం ఇచ్చారు. అదేమంటే… మహేశ్ బాబు రాముడిగా నటించబోతున్నారనే వార్తను ఖండించకుండానే… ఖరారు చేయకుండా… ‘ప్రేక్షకులు కోరుకునే భారీ తారాగణం ఈ సినిమాలో ఉండబోతోంది’ అంటూ చెప్పడం అందరి అనుమానాలను బలపరిచేలా చేస్తుంది. అలాగే ఈ సంవత్సరం దీపావళికి ప్రతిష్ఠాత్మకమైన రామాయణ్ ప్రాజెక్ట్ లో రాముడిగా మహేశ్ బాబు పేరును అధికారికంగా ప్రకటిస్తారనేది తెర వెనుక వినిపిస్తున్న మాట. అదే నిజమైతే… మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలు ఇద్దరు పాన్ ఇండియా మూవీలో…. అదీ మైథాలజీ మూవీలో రాముడి పాత్ర చేయడం అనేది గొప్ప చారిత్రక ఘట్టంగానే చెప్పుకోవాలి. అందుకోసం ఆస్కార్ విన్నింగ్ సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారని కూడా సమాచారం. చూద్దాం ఏం జరగనుందో.