మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా
మహారాష్ట్ర ప్రభుత్వంలో హోంమంత్రిపై ఆరోపణలు సంచలనంగా మారాయి. తనపై మోపిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయాలని బొంబాయి హైకోర్టు ఆదేశించడంతో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ దేశ్ ముఖ్ మీద చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఈ రోజు ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ నిర్వహించాలని హైకోర్టు కేంద్ర ఏజెన్సీని ఆదేశించింది.
అదేవిధంగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేసినట్లు ఎన్సిపి మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు దేశ్ముఖ్ ఎన్సిపి చీఫ్ శరద్ పవార్ను కలిశారని ఆయన అన్నారు. శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు దేశ్ ముఖ్ తన రాజీనామాను పంపారు. అలాగే మరాఠీలో రాసిన తన లేఖలో, దేశ్ ముఖ్ బొంబాయి హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ‘నైతిక ప్రాతిపదికన’ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా గత నెలలో, ముంబై మాజీ పోలీసు చీఫ్ పరమ్ బీర్ సింగ్, ఎస్యూవీ కేసులో అరెస్టై ఎన్ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వాజేను ముంబై నుంచి రూ.100 కోట్లు వసూలు చేయమని దేశ్ ముఖ్ కోరినట్లు ఆరోపించారు. రెస్టారెంట్లు, బార్లు మరియు హుక్కా బార్ల నుండి ఆ డబ్బు వసూలు చేయమని ఆయన ఆదేశించారని ఆరోపించిన విషయాలు సంచలనంగా మారాయి.