మహారాష్ట్ర హోంమంత్రి పై కంగనా పంచ్
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తనపై మోపిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయాలని బొంబాయి హైకోర్టు ఆదేశించడంతో తాజాగా అనిల్ దేశ్ ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ దేశ్ ముఖ్ మీద చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
అయితే ఈ విచారణను 15 రోజుల్లోగా ప్రాథమికంగా నిగ్గు తేల్చాలని హైకోర్టు కేంద్ర ఏజెన్సీని ఆదేశించింది. కాగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేసినట్లు ఎన్సిపి మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. ఈ వివాదంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘స్త్రీలను వేధించి, హింసించేవారికి ఎప్పటికైనా పతనం తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముందు ముందు భవిష్యత్తులో చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని కంగనా వెల్లడించారు. ప్రస్తుతం కంగనా చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీస్తున్నాయి. గతంలో కంగనాకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓరకమైన యుద్ధమే చోటు చేసుకున్న విషయం తెలిసిందే.