మణిరత్నం ఓ సినీ డైమండ్….

చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ముఖ్యంగా మణిరత్నం సినిమాల్లో గ్లామర్ తో పాటు గ్రామరూ కనిపిస్తుంది. అందుకే సినిమా పరిజ్ఞానం ఉన్న అందరికీ మణి సినిమమాల్లో గ్రామర్ అర్థమౌతుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేరియో ప్యూజో రాసిన ‘గాడ్ ఫాదర్’ ఆధారంగా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా రూపొందించిన ‘గాడ్ ఫాదర్’ ట్రయాలజీ సినీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ‘గాడ్ ఫాదర్’ తొలి రెండు భాగాలు ఎంతగానో మురిపించాయి. ఈ సినిమాలను స్టడీ చేసి దర్శకత్వంలో రాణించిన వారు ఎందరో ఉన్నారు. వారిలో మణిరత్నం కూడా ఉండటం విశేషం. ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితో మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకన్’ సినిమా ‘టైమ్ మేగజైన్’ ఎంపిక చేసిన టాప్ 100 మూవీస్ లో చోటు చేసుకోవడం విశేషం. దీన్ని బట్టి మణిరత్నం ప్రతిభా పాటవాలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తెలుగులో ‘నాయకుడు’ పేరుతో అనువాదమై మంచి ప్రజాదరణ పొందింది.
అదేవిధంగా మణిరత్నం సినిమాలు వ్యాపార పరంగా కూడా ఘనవిజయాలను అందుకున్నాయి. పాత కథాంశాన్నే కొత్తగా చెప్పడంలో మణి ఎప్పుడూ ముందుంటారు. తండ్రి ఒక్కరే, తల్లులు వేరైన ఇద్దరు కొడుకుల మధ్య సాగిన ‘ఘర్షణ’ ఆధారంగా ‘అగ్నినచ్చత్రం’ తెరకెక్కించినప్పుడు జనం జేజేలు పలికారు. అంతకముందు ‘మౌనరాగం’ తో మణిరత్నం ప్రేక్షకులను తమవైపుకు తిప్పుకున్నాడు. అప్పటి నుంచి ఇతరుల సినిమాల కంటే భిన్నంగా మణిని ప్రేక్షకాదరణ ఏర్పడింది. తమిళనాట టాప్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ తో, ఆ తర్వాత ప్రభు, కార్తిక్ తో మణి చేసిన సినిమా మంచి హిట్ ను అందుకున్నాయి. ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ రూపొందించిన ‘ఇ.టి.’ స్ఫూర్తితో మణి తెరకెక్కించిన ‘అంజలి’ ఆబాలగోపాలాన్ని మైమరపించింది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఏకైక తెలుగు సినిమా ‘గీతాంజలి’. ఈ సినిమాలో ప్రేమ ప్రేమను కోరుకుంటుందనే అంశాన్ని మణి తెరపై ఆవిష్కరించిన తీరు జనాన్ని ముగ్ధమోహనం చేసింది.
అంతేకాకుండా మణిరత్నం సినిమాల ద్వారా ఎందరో సినీ జగత్తులో నీరాజనాలు అందుకున్నారు. మణి ‘మౌనరాగం’తోనే కార్తిక్, రేవతి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ‘అగ్నినచ్చత్రం’తో ప్రభు, అమల స్టార్ డమ్ అందుకోగా, నిరోషాకు ఆ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా రజనీకాంత్ ‘దళపతి’లో ఓ కీలక పాత్రలో కనిపించిన అరవింద స్వామి, మణి ‘రోజా’తో పాపులర్ స్టార్ అయిపోయాడు. అలాగే ‘రోజా’తో సంగీత దర్శకునిగా పరిచయమైన ఎ.ఆర్.రహమాన్ ఆ తర్వాత మణి సినిమాలతోనే తనదైన గుర్తింపును అందుకున్నాడు. ఇంకా మణిరత్నం ‘ఇరువర్’తోనే ఐశ్వర్యారాయ్ తెరంగేట్రం చేసింది. మణి సినిమాలతోనే పి.సి.శ్రీరామ్, సంతోష్ శివన్, రాజీవ్ మీనన్, రవి కె.చంద్రన్ వంటి సినిమాటోగ్రాఫర్స్ కు ఎనలేని పేరు లభించింది. ఇలా ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు మణిరత్నం నిజంగా సినీజగత్తులో ఓ డైమండ్ గా చెప్పవచ్చు. ఈరోజు మణిరత్నం పుట్టిన రోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *