మంత్రి హరీష్ రావు పై విరుచుకుపడ్డ ఈటల

తెలంగాణలో మాజీ మంత్రి ఈటలతో టీఆర్ఎస్ పార్టీ వైరం, మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హుజురాబాద్లో ప్రచారంలో బిజీగా ఉన్న మాజీ మంత్రి ఈటల మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హుజురాబాద్ కు జనాలను మంత్రి హరీష్ రావు తీసుకు పోయి… దావత్, డబ్బులు ఇవ్వాలని… ఇదే పని ఆయనది అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మెప్పు పొందాలనే ఇలా మంత్రి హరీష్ రావు చేస్తున్నాడని విరుచుకు పడ్డ ఆయన.. హరీష్ కు కూడా తన గతే పడుతుందని జోస్యం చెప్పారు. హుజూరాబాద్ చైతన్యవంతమైన గడ్డ అని.. ప్రాణాన్ని లెక్కచేయకుండా పోరాటం చేసిన గడ్డ హుజురాబాద్ అని ఈటల స్పష్టం చేశారు.
అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ రాసి పంపించి మాట్లాడిపిస్తున్నారని అన్నారు. అలాగే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకవచ్చి మంత్రులను చేసిన ఘనత కూడా కేసిఆర్ ది అని వివరించారు. కాగా బానిసగా బ్రతికిన చరిత్ర, బ్రతికే చరిత్ర మాకు లేదని…డబ్బును, ప్రలోభాలను పాతరవేసే సత్తా హుజురాబాద్ ప్రజలకు ఉందని అన్నారు. అంతేకాకుండా ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ…బీజేపీ పార్టీ అని పేర్కొన్న ఆయన తాను వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో ఉండగానే….కేసీఆర్ కుట్రలు చేశాడని… వాళ్ళ అబద్ధాల పత్రిక, అబద్దాల ఛానల్ లో పదే పదే అబద్ధాలు చెప్పారని ఈటల మండిపడ్డారు.