భక్తులకు టీటీడీ కీలక సూచనలు….

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల భక్తులకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతున్న ఈ సమయంలో అంతా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా చేరే పుణ్యక్షేత్రాల్లో ఆంక్షలు ఎక్కువగా పెడుతున్నారు. దీంతో.. తిరుమలకు వచ్చే భక్తులకు కీలక సూచనలు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
ముఖ్యంగా దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులు ఈ సమయంలో తిరుమల యాత్రను వాయిదా వేసుకోవడమే మంచిదని సూచించింది టీటీడీ. అలాగే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని టీటీడీ సూచించింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు.. కరోనా కారణంగా దర్శనానికి రాని వారు రానున్న 90 రోజుల వరకు దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ తన ప్రకటనలో తెలిపింది. కాగా కరోనా ఉధృతితో ఇప్పటికే టైంస్లాట్ టోకెన్ల కోటాను నిలిపివేసిన టీటీడీ.. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా విడుదల చేసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా తగ్గించే దిశగా ఆలోచన చేస్తోంది. అయితే ఈరోజు సీఎం వైఎస్ జగన్ హైలెవల్ మీటింగ్ ఉండటంతో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయం ఉత్కంఠగా మారడం విశేషం.