ఫ్యాన్స్ పై కోపం తెచ్చుకున్న జూ. ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్స్ వింటే చాలు ఎవరైనా దాసోహం కావాల్సిందే. ఆయన మాటతీరు సీనియర్ ఎన్టీఆర్ తో పోల్చుకొని ఆనందపడుతుంటారు అభిమానులు. తాజాగా ఎన్టీఆర్ ఎక్కడికి ఏ సభలకు వెళ్లినా రాజకీయపు శబ్దాలు తీవ్రంగా చెవులలో మోగుతున్నాయి. దీంతో ఓ రకంగా ఎన్టీఆర్కు పొలిటికల్ కామెంట్లు చుట్టుముడుతున్నాయనే చెప్పాలి. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తున్నారు.? వంటి ప్రశ్నలు, సీఎం, సీఎం అనే నినాదాలు పెరుగుతున్నాయి.
తాజాగా ఓ సినిమా ఆడియో ఫంక్షన్ కు విచ్చేశారు ఎన్టీఆర్. స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతానికి పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. రాజకీయాల విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. కానీ ఆయన పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఆయన అభిమానులు యంగ్ టైగర్ని చూస్తే చాలు సీఎం.. సీఎం అని నినాదాలు చేస్తున్నారు. తాజాగా ‘తెల్లవారితే గురువారం’ అనే ఓ సినిమా ఫంక్షన్కి వచ్చిన ఎన్టీఆర్కు ఇదే అనుభవం ఎదురైంది. స్టేజ్ మీదికి వచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతుండగా.. అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆపండి అంటూ ఒక్కసారిగా కరిచారు. ఆగండి బ్రదర్ అంటూ తాత స్టయిల్లో రిప్లై ఇచ్చారు. వద్దని వారించారు. దీంతో వారు వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. సీఎం నినాదాలు.. దానికి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లై ఆసక్తి రేపుతోంది..!
కాగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘నాకు ఇరవయ్యేళ్ల నుంచి దేవుడిచ్చిన శక్తి మీరైతే.. నాకు దేవుడిచ్చిన కుటుంబం జక్కన్న, కీరవాణి కుటుంబం. నా జీవితంలో తీసుకున్న ఎన్నో నిర్ణయాల వెనుక ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఉంది. ఈ కుటుంబానికి నేనెప్పుడూ అతిథిని కాను కాలేను. నేను వాళ్లను కుటుంబ సభ్యులుగా భావిస్తాను. ఇక ఈ సినిమా గురించి మాట్లాడాలంటే.. హీరో శ్రీసింహ, డైరెక్టర్ మణికాంత్, సంగీత దర్శకుడు కాల భైరవతో పాటు ఈ సినిమాకు పని చేసిన వారందరికీ.. ఈ సినిమా ఓ అద్భుతమైన విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్లీ సక్సెస్ మీట్లో కలుద్దాం’ అంటూ తనదైన శైలిలో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *