ప్రముఖ హాస్య నటుడు మృతి… షాక్ లో సినీలోకం..
ప్రముఖ కోలీవుడ్ హాస్యనటుడు వివేక్ ఈరోజు తెల్లవారుజామున 4:35 గంటలకు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండె నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇంత సెడన్ గా మృత్యువాత పడటంతో కోలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. వివేక్ మరణం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. దాదాపుగా 300లకుపైగా సినిమాల్లో నటించిన మెప్పించారు వివేక్. కె బాలచందర్ దర్శకత్వం వహించిన మనదిల్ ఉరుది వేండం సినిమాతో వెండితెరకు పరిచయమైన వివేక్ కోలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించారు.
అసలు ఒక టైంలో వివేక్ సినిమాలో లేకుండా తమిళ సినిమా రిలీజ్ అయ్యేది కాదు. అంతటి పాపులారిటీ సంపాదించుకున్న వివేక్ కు 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగులో కూడా డబ్బింగ్ చిత్రాలతో వివేక్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాయ్స్, శివాజీ, ప్రేమికుల రోజు, అపరిచితుడు, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వివేక్ కొడుకు ప్రసన్నకుమార్ 13 ఏళ్ల వయసులో మొదడులో రక్తం గట్టకట్టడంతో చనిపోయాడు. అలాగే అనారోగ్యంతో వివేక్ తల్లి కూడా మృతి చెందింది. కొడుకు, తల్లి ఆకస్మిక మరణాలతో వివేక్ బాగా కృంగిపోయాడని, అప్పటినుంచి సినిమాలు చేయడం కూడా బాగా తగ్గించాడని సమాచారం.
కాగా గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకొనేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్ మృతి పట్ల దేవీశ్రీ ప్రసాద్, ఏఆర్. రెహమాన్, సుహాసిని, ప్రకాశ్రాజ్, రాఘవ లారెన్స్, జీవా, సమంత, ధనుష్, విజయ్, సహా పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.