ప్రజల మధ్య చిచ్చు పెట్టకండి అంటూ గుత్తా ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణలోని నల్గొండ జిల్లా రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతాయి. తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని… వివిధ వ్యవసాయ పథకాల అవసరాల కోసం 15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా దేశంలో తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధిలో ముందు ఉందని చెప్పిన ఆయన ఆంధ్ర పాలనలో తెలంగాణ దోపిడీకి గురయ్యిందని.. ఇంకా దుర్బుద్ధితో కొత్త, కొత్త పార్టీలు ఆవిర్భావిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని… పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా నీటి దోపిడీ చేసింది ఎవరు? అని షర్మిలను నిలదీశారు. ఇంకా మళ్లీ తెలంగాణ ప్రజల మధ్య బేధాభిప్రాయాలు, అలజడి సృష్టించాలనే మీ పన్నాగాలు ఇక పారవని… తెలంగాణ ప్రజలు తెలివిగల వారని… మీ కుట్రలు కుతంత్రాలు తిప్పి కొడతారని గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతాలు, ప్రాంతాలు, కులాల పేరుతో చిచ్చు పెట్టే వారికి బుద్ది చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని… పెయింటింగ్ పని చేసుకునే వాడు ఈరోజు రేంజ్ రోవర్ కారులో తిరుగుతున్నాడని నిప్పులు చెరిగారు.