ప్రజలు భయపడకండి: ఏపీ మంత్రి ఆళ్లనాని
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మూడు గంటలపాటు కోవిడ్ పై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం నిర్వహించింది. కోవిడ్ నియంత్రణ, వైద్య సదుపాయాలు, కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణపై అధికారులతో ఆళ్ళ నాని సమావేసంలో తీవ్ర చర్చోపచర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనా వైరస్ ను నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సవివరంగా చర్చించామని, బెడ్స్ కొరత, రెమిడెసివర్ లభ్యత వంటి అంశాలపై కూడా చర్చించినట్లు ఆయన వివరించారు.
అదేవిధంగా.. 104 కాల్ సెంటర్ ను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించామని అన్నారు. కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన ఆయన ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని కూడా వివరించారు. అలాగే రేపు ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్ష జరగనుందని ఈరోజు చర్చించిన అంశాలు ముఖ్యమంత్రికి నివేదిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఎటువంటి పరిస్థితి వచ్చినా తగిన సాయం అందించేందుకు రెడీగా ఉందని వెల్లడించారు. కాగా ప్రైవేటు హాస్పిటళ్ళు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువగా కోవిడ్ బాధితుల నుంచి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు కూడా వ్యక్తిగత రక్షణ చర్యలు పాటించాలని వెల్లడించిన ఆయన ప్రస్తుతం అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లకు ఆక్సిజన్ సరఫరా చేయాలని అన్నారు. 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోందని… అందుకు సరిపడా ఉత్పత్తి ప్రస్తుతం ఉందని ఆళ్లనాని వివరించారు.