పోలవరంపై వైఎస్ జగన్ కీలక ఉత్తర్వులు…
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం. కేంద్రప్రభుత్వం పోలవరం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో తీవ్ర వివాదాస్పదంగా మారింది పోలవరం ప్రాజెక్టు వ్యవహారం. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు లోని ప్రధాన డ్యామ్ అంచనాల పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ అంచనాలను రూ. 7,192 కోట్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రధాన డ్యామ్ నిర్మాణం కోసం రూ. 5, 535 కోట్లుగా జలవనరుల శాఖ నిర్ధారించింది. అయితే ప్రధాన డ్యామ్ లో భాగమైన స్పిల్ వే, ఈసీఆర్ ఎఫ్, స్పిల్, పైలట్ ఛానల్ వంటి నిర్మాణాల అంచనాలను మరో రూ. 1600 కోట్ల మేర పెంచుతూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ మధ్యనే సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు వచ్చేలోపు పూర్తి చేయాల్సిన పనులపై సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. కాఫర్ డ్యాంలో ఖాళీలు పూర్తి, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, గేట్ల పూర్తి, మెయిన్ డ్యాం పనులు తదితర కీలక పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. స్పిల్ ఛానల్లో మట్టి, కాంక్రీట్ పనుల తవ్వకం పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రానున్న 45 రోజులు పోలవరం ప్రాజెక్టు పురోగతి అత్యంత కీలకమని, వర్షాలు వచ్చేలోగా పనులు అత్యంత వేగంగా, సమర్థవంతంగా జరగాలని సీఎం ఆదేశించారు. కాగా ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న ప్రాజెక్టులకు నిధుల విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తున్నామని సీఎం జగన్ వివరించారు. పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో నిధుల విడుదలతో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం అడుగులేస్తుందని వైఎస్ జగన్ వివరించడం విశేషం.