పొట్టి వీరయ్య మృతి కలచివేసింది : చిరంజీవి

టాలీవుడ్ లో సుమారు 300కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పొట్టివీరయ్య. తాజాగా వీరయ్య హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గుండెకు సంబంధించిన సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయన దురదృష్టవశాత్తు.. ఆదివారం (25 ఏప్రిల్) సాయంత్రం కన్నుమూశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అతని చివరి కర్మలు సోమవారం జరుగుతాయని అన్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫానిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచీ రంగస్థల కళాకారుడు. సినీరంగంలో దశాబ్ధాల పాటు ఆయన ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి వైవిధ్యభరితమైన నటనను ప్రదర్శించాడు.
అదేవిధంగా పరిశ్రమకు సుదీర్ఘ కాలం సేవలందించిన వీరయ్య మృతి పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్ళను అధిగమించి, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీ పొట్టి వీరయ్య గారి మృతి ఎంతో కలచి వేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నాను’ అంటూ వివరించారు.