పెట్రోపై పార్లమెంట్ లో మంట మండనుందా..?

ఈరోజు నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు బడ్జెట్ సెషన్ కొనసాగనుంది. అయితే కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుండటంతో.. ఎంపీల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పెరుగుతున్న పెట్రో ధరలపై పార్లమెంట్ ఉభయసభలలో ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ. భావసారూప్య పార్టీలను సంప్రదించి ఉమ్మడిగా కలిసి యుద్ధం చేసేందుకు రెడీ అవుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలకు చెందిన ఎంపీలు సమావేశాలకు గైరుహాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా పెట్రో ధరలను ఎందుకు నియంత్రించలేకపోతున్నారో పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. పెరుగుతున్న పెట్రో ధరలపై ఉభయ సభలలో చర్చ కోసం కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది. అలాగే వివిధ శాఖల పద్ధులు, ఫైనాన్స్ బిల్లు ఆమోదంపై దృష్టి సారించింది సర్కార్. ఉదయం 9 గంటలకే రాజ్యసభ సమావేశం కానుంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిల్లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ సవరణ బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది ప్రభుత్వం. కాగా సాయంత్రం 4 గంటలకు లోకసభ సమావేశం కానుంది. మహిళా సాధికారత అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సత్యవతి సావధాన తీర్మానం ఇచ్చారు. తమిళనాడు ఎస్సీ జాబితా మార్పుపై రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ లాస్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుండటం కూడా ఉంది.