పుట్టా మధుపై రూ.900 కోట్ల ఆరోపణలు…
తెలంగాణ మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధు అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. రోజు రోజుకీ పుట్టా అక్రమాల గుట్ట కదులుతుంది. పుట్టా మధుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వామన్ రావు కేసులో పుట్టా మధుకు ఉచ్చు బిగిస్తుండగా.. తాజాగా మరికొన్ని ఆరోపణలు వస్తున్నాయి. పుట్టా మధు అక్రమంగా 900 కోట్లు సంపాదించినట్లు ఆరోపిస్తూ దర్యాప్తు సంస్థలకు కాంగ్రెస్ నేత, మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ ఫిర్యాదు చేయడం విశేషం.
అయితే ఫిర్యాదుదారుడు సతీష్ అందుకు సంబంధించి పుట్ట మధుపై ఐటి, సీబీఐ, ఈడి అధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు. జూబ్లిహిల్స్ లో సినీ నటుడు శ్రీహరి ఇంటి పక్కనే 5 కోట్లు విలువ చేసే ఇల్లును పుట్ట మధు కొనుగోలు చేశారని.. తల్లి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కోట్లు వసూళ్లు చేశారని కూడా సతీష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే పుట్టా మధు 900 కోట్లు అక్రమంగా సంపాదించారని… అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ లలో 100 కోట్ల విలువైన పెట్టుబడులు హోటల్స్, నిర్మాణ రంగంలో పెట్టుబడి పెట్టారని కూడా తెలుస్తోంది. ముంబైలోని ఆది రాజ్ కన్స్ స్రక్షన్స్ పేరుతో పుట్ట మధు 50 కోట్ల పెట్టుబడులు పెట్టారని… కాటారం మండలం ఒడిపిలవంచలో 2 కోట్లు విలువ చేసే 50 ఎకరాల వ్యవసాయ భూమి సంపాదించారని కూడా అందులో తెలిపాడు. పలివెల మండలం మహాదేవపూర్ లో నాలుగు కోట్లు విలువ చేసే 100 ఎకరాల వ్యవసాయ భూమి సంపాదించారని.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పుట్ట మధు తన క్లాస్ మేట్ శ్రీనివాస్ బినామీ పేరుతో భువన సురయి డెవలపర్స్ లో 100 కోట్లతో పెట్టుబడులు పెట్టారని సంచలన ఆరోపణలు కూడా గుప్పించారు.
అంతేకాకుండా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఇసుక క్వారీని పుట్టా మధు సోదరుడు పుట్ట సత్యనారాయణ పేరుతో నడుపుతున్నారని… దీని టర్నోవర్ 50 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో భవిత శ్రీ చిట్ ఫండ్స్ 20 బ్రాంచేస్ లో పుట్ట మధు 50 కోట్ల పెట్టుబడులు పెట్టారని… మంథని మండలం విలోచవరంలో 60 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమి కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో 40 ఎకరాల ల్యాండ్, దాంట్లో 40 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నాడని ఇనుముల సతీష్ వెల్లడించారు. కాగా పుట్టా మధు అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన కేసు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణిలు సతీష్ తరుపున వాదిస్తున్నారు. ఈ కేసుతో పాటు పుట్ట మధుపై నమోదైన అనేక కేసులను వామన్ రావు దంపతులే న్యాయవాదులుగా ఉన్నారు. ఇందులో భాగంగా వారికి ప్రాణహాని ఉందని కూడా పలుమార్లు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. మొత్తానికి వీటి అన్నింటికీ సంబంధించి ఇప్పుడు పుట్టా మధుకు అన్ని రకాలుగా ఉచ్చు బిగుస్తుందని చెప్పవచ్చు.