పవన్ కల్యాణ్ కి కరోనా… ఫామ్ హౌస్ లోనే వైద్యం…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి కరోనా సాకింది. నిజానికి కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్గా వచ్చాయి.. కానీ.. అప్పటి నుంచి ఆయన ఫామ్ హౌస్ లోనే హోం క్వారంటైన్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెట్టడంతో.. రెండో రోజుల క్రితం మరోసారి కోవిడ్ పరీక్షలు చేయించకున్నారు. కరోనా పాజిటివ్గా తేలింది అని జనసేన పార్టీ తెలిపింది.
ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్.. హైదరాబాద్కు వచ్చి పవన్ కల్యాణ్కు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తగిన, అవసరమైన పరీక్షలన్నీ చేయించారని.. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నెమ్ము చేరకోవడంతో.. యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారని.. అవసరం మేరకు ఆక్సిజన్ కూడా అందిస్తున్నామని జనసేన తన ప్రకటనలో వెల్లడించింది. కాగా చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యంపై వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని.. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కల్యాణ్ను పరీక్షించిందని.. జ్వరం, ఊపిరితిత్తుల్లోని నెమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారని తెలుస్తోంది. అయితే తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపినట్టు జనసేన పార్టీ తన ప్రకటనలో పేర్కొంది.