న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు మెయిల్
డైరెక్టర్ ఉదయ్ గుర్రాల… ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులుగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై చేసిన సినిమా మెయిల్. ఈ సినిమాని ప్రియాంక దత్ నిర్మించారు. అయితే ఓటీటీ కోసం తీసిన ఈ సినిమాను ఈ యేడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేశారు. 1980 నేపథ్యంలో సాగే ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రాన్ని యువతరం బాగా ఆదరించిన విషయం తెలిసిందే.
అదేవిధంగా కంప్యూటర్ వచ్చిన కొత్తలో ఆ టెక్నాలజీకి అలవాటు పడలేక, దానిని అర్థం చేసుకోలేక కుర్రాళ్ళు పడిన తిప్పలను వినోద ప్రధానంగా డైరెక్టర్ ఉదయ్ ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ కరోనా పాండమిక్ సమయంలో ఈ చిత్ర బృందానికి ఓ తీపి కబురు అందింది. అదేమంటే… జూన్ 4 నుండి అమెరికాలో జరుగబోతున్న ‘న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘మెయిల్’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని స్వప్న సినిమా సంస్థ ట్వీట్ చేస్తూ.. తన హర్షాన్ని వ్యక్తం చేసింది. ‘కంబాలపల్లి కథలు’ సీరిస్ లో తొలిసారిగా వచ్చిన ‘మెయిల్’కు లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకొని మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఓటీటీ సినిమాలు ఇదే సీరిస్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.