నేను మూసుకోను, అందరి లెక్కా తేలుస్తా: హీరో సిద్ధార్థ్

కరోనా దేశాన్ని పీడిస్తున్న ఈ సమయంలో పలువురు ప్రముఖులు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్య హీరో సిద్ధార్థ చేసిన ట్వీట్ చాలా వివాదాస్పదంగా మారింది. సినిమా స్టార్స్ ను, పొలిటికల్ పార్టీలను దృష్టిలో పెట్టుకుని హీరో సిద్ధార్ధ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఇప్పుడు అదే ట్వీట్ అతనికి సవాల్ గా మారింది.
ముఖ్యంగా దేశంలో జరుగుతున్న హారర్ స్టోరీని సెలబ్రిటీస్ మౌనంగా చూడటం ఎంత మాత్రం తగదంటూ ఈ మధ్య సిద్ధార్థ ట్వీట్ చేశాడు. కనీసం ప్రజలైనా ప్రశ్నించాలని, ప్రభుత్వాలను నిలదీయాలని ఆయన అందులో ఘాటుగా వ్యాఖ్యానించాడు. సిద్ధార్థ ఇలాంటి ట్వీట్ చేయడంతో స్టార్ హీరోల ఫ్యాన్స్ విషయం అలా పక్కన బెడితే.. తమిళనాడులోని బీజేపీ కార్యకర్తలు మాత్రం రెచ్చిపోతున్నారు.
తాజాగా హీరో సిద్ధార్థ్ ట్వీట్ చేస్తూ… ‘తన ఫోన్ నంబర్ ను బీజేపీ నేతలు లీక్ చేశారు. అంతటితో ఆగకుండా తనను తిట్టమంటూ కార్యకర్తలను ఉసికొల్పారు’ అని సిద్ధార్థ ఆరోపించారు. అయితే గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఐదు వందలకు పైగా ఫోన్ కాల్స్ తనకు వచ్చాయని, తనను చంపుతామని, రేప్ చేస్తామని, అగౌరవంగా మాట్లాడారని సిద్ధార్థ్ తెలిపాడు. దీనికి సిద్ధార్థ్ స్పందిస్తూ… ఎంత బెదిరించినా తన నోరు మూయలేరని తీవ్రంగా హెచ్చరించాడు. తనను ఫోన్ లో దూషించిన వారి కాల్స్ రికార్డ్ చేశానని, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారి డీపీలను కాపీ చేశానని వీరిపై పోలీసు కంప్లైట్ ఇస్తున్నానని సిద్ధార్థ్ వెల్లడించాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశాడు. మొత్తానికి ఈ సిద్ధార్థ్ ట్వీట్ వ్యవహారం చివరికి ఢిల్లీకి తాకేట్టుగానే ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *