నాగార్జున సాగర్ బైపోల్ ఇక సమరమే… పోటీలో వైసీపీ..

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అందరిదృష్టి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వైపు మళ్లింది. ఏప్రిల్ 17వ తేదీన జరిగే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో సత్తా చాటే పార్టీ ఎవరన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే త్రిముఖ పోరా?.. బహుముఖ పోరా? అనే విషయంపై కూడా సర్వత్రాచర్చ సాగుతుంది.
ముఖ్యంగా మాజీ మంత్రి జానారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అధికార పార్టీ టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శిబిరాల నుంచే ఎలాంటి ఉలుకు పలుకూ లేదు. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చేసినా ఇంకా ఆయా పార్టీలు కసరత్తులు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో టీఆర్ఎస్, బీజేపీలు వేస్తున్న ఎత్తుగడలే రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉండగా.. ఊహించని రీతిలో ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా వైసీపీ నుంచి ఓ అభ్యర్థి నామినేషన్ వేయడం అందరిని షాక్ కు గురిచేస్తోంది. ఇప్పటి వరకు సాగర్ ఉప ఎన్నికకు 13 నామినేషన్స్ దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ వెల్లడించారు. అందులో 12 ఇండిపెండెంట్లు ఉండగా.. మరొకరు వైసీపీ అభ్యర్థి అని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా.. వెనుక నుంచి టీఆర్ఎస్కు సపోర్టు చేసిన వైసీపీ.. సాగర్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అయి కాగా వైసీపీ బరిలో ఉంటే.. ఓట్లు చీలిపోయి.. టీఆర్ఎస్కే మేలు జరుగుతుందని రాజకీయా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.