నాకు ప్రాణం విలువ బాగా తెలుసు… అందుకే….

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఒక్కరోజే నిరాడంబరంగా జరిగాయి. 2021-22 సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ కీలకోపన్యాసం చేశారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ వెల్లడించారు. తాను ముఖ్యమంత్రిగా, తన సహచర మంత్రులు, తన ఎమ్మెల్యేలు అనే గర్వం ఎవ్వరిలో లేదని తామంతా ప్రజా సేవకులం అంటూ నిజాయితీగా నికార్సైన పాలన చేస్తున్నందుకు గర్విస్తున్నామని వివరించారు. ముఖ్యంగా కోవిడ్ హమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ అసెంబ్లీలో నివాళి అర్పించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ నాకు ప్రాణం విలువ తెలుసు… అందుకే ఏకంగా తాము కోవిడ్ రోగుల కోసం 47 వేల బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. కోవిడ్ కేర్ సెంటర్లలోనూ 52 వేల బెడ్లను అందుబాటులోకి తెచ్చాం. 18 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులోకి తెస్తున్నాం. కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నాం. గడిచిన 14 నెలల్లో కోవిడ్ నియంత్రణకు రూ.2,229 కోట్లు కేటాయించాం. కోవిడ్ సమాచారం కోసం 104ను అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటివరకు 3.12 లక్షలమంది 104 సేవలు వినియోగించుకున్నారు. 104 ద్వారా 60 వేలమందికిపైగా కోవిడ్ రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశాం. టెలీమెడిసిన్ ద్వారా 3,991 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. విదేశాల నుంచి ఆక్సిజన్ను దిగుమతి చేసుకుంటున్నాం’ అని ఆయన కరోనా పట్ల తమ ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా చిత్తశుద్ధితో పనిచేస్తుందో వివరించారు.
జగన్ ఏం మాట్లాడారంటే… వరుసగా….
బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చామని, ఆ చికిత్స కోసం ముఖ్యంగా ఇప్పిటికే 17 ఆస్పత్రులను కేటాయించి సేవలందిస్తున్నామని అన్నారు. టీచింగ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటు చేస్తామని, 50 ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేశామని తెలిపారు. నర్సులు, డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, అధికారుల కృషి వల్ల.. మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మనమూ ఉన్నామని వెల్లడించారు. కోవిడ్ కేసులను వెంటనే గుర్తించి వేగంగా వైద్యం అందించడం ద్వారానే మరణాల రేటును తగ్గించగలిగామని అన్నారు.
ముఖ్యంగా దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలంటే.. 172 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమని.. కానీ దేశంలో నెలకు 7 కోట్ల డోసుల ఉత్పత్తికి మాత్రమే సామర్థ్యం ఉంది. ఇక దేశంలో ఇప్పటివరకు 18.44 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తైందని అన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే.. 7 కోట్ల డోసులు అవసరం అవుతుందని తెలిపారు. వ్యాక్సిన్ కోటా కేటాయింపు ప్రక్రియ పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉందని మరోసారి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఎల్లో మీడియా వాస్తవాలను వక్రీకరిస్తుంది…!
ముఖ్యంగా ఏపీ గురించి మీడియాకు అన్ని విషయాలు తెలిసినా ఏమీ ఎరుగనట్లుగా పూర్తిగా వాస్తవాలను వక్రీకరించి రోజూ అవాస్తవాలను ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. భారత్ బయోటెక్ స్వయంగా రామోజీరావు కుమారుడి వియ్యంకుడిదేనని… ఆ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో వారికి తెలియదా? అంటూ చురకలు అంటించారు. అన్నీ తెలిసి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను కూడా పిలిచిందని దీంతో… వ్యాక్సిన్లు ఎలాగైనా తెస్తామని.. ప్రజలకు ఉచితంగా అందిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా..?
వైఎస్ జగన్ ఈరోజు అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మనం నాలుగు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితేనే అభివృద్ధి అనుకుంటామని, అసలు అభివృద్ధి అంటే.. నిన్నటికంటే ఈరోజు బాగుండాలి. రేపు మరింత బాగుంటుంది అనే భరోసా కల్పించాలి. అదే అభివృద్ధికి సంకేతమని అన్నారు. నాడు-నేడు ద్వారా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళా సాధికారతపై దృష్టి పెట్టామని, రాష్ట్రంలో 62 శాతంమంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, వారి బతుకులు మార్చకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని వివరించారు. రైతులకు విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ తెలిపారు.
అంతేకాకుండా తమ ప్రభుత్వంపై ఎంతో మంది ఎన్నో కుట్రలు పన్నుతున్నారని, కుట్రలు పన్ని గోడలపై ఉన్న రంగులు తుడిచివేయగలరేమో గానీ.. ప్రజల గుండెల్లో రంగులను మాత్రం తాకలేరని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, తిరుపతి ఉపఎన్నికలు ఏవి చూసుకున్నా ఒకే జెండా ఎగిరిందని.. అదే తమ ప్రభుత్వం అంటూ ఆయన వెల్లడించారు. కాగా గత 23 నెలల్లో ప్రజలకు నేరుగా రూ.93,708 కోట్లు అందించామని, మరో రూ.31,714 కోట్లు ప్రజలకు పరోక్షంగా అందించామని, మొత్తం రూ.లక్షా 25 వేలకోట్లు ప్రజలకు చేరవేశామని వైఎస్ జగన్ తెలిపారు.