దేశానికే రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ : గవర్నర్
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఒక్కరోజు అసెంబ్లీ జరుగుతుంది. అందులో భాగంగా తొలుత ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ విధానంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ ఈ సందర్భంగా తెలిపారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా సాగుతోందని మృతు సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఏపీలో విపరీతంగా ఉంది. కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్ చేశారు గవర్నర్. అలాగే కొత్తగా కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశామని.. ప్రైవేట్ ఆస్పత్రిలోనూ కోవిడ్ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కింద ఏర్పాట్లు చేశామని వివరించారు. కాగా ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచీ క్రయోజనిక్ ఆక్సిజన్ తెప్పించామని గవర్నర్ వివరించారు.
అదేవిధంగా ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ దుష్ప్రభావం చూపిస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించామని అన్నారు. ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హామీలను పూర్తి చేశామని, ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్ వచ్చిందని వివరించారు. ప్రతిరోజూ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని అలాగే జగనన్న విద్యాకానుక కింద 47 లక్షల మందికి విద్యాకానుక అందించామని, కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచిందని వివరించారు. అలాగే 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు టీకాలను ఇచ్చామని 21.64 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని గవర్నర్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా ‘జగనన్న విద్యాదీవెన కోసం 4879.30 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.1049 కోట్లు కేటాయించాం. మనబడి-నాడు నేడు కింద 15717 స్కూళ్ల ఆధునికీకరణ చేపట్టాం. స్కూళ్ల ఆధునికీకరణకు రూ.3,948 కోట్లు కేటాయించాం. విద్యాశాఖకు అన్ని పథకాల కింద రూ.25,714 కోట్లు కేటాయించాం. 44.5 లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మఒడి వర్తింప చేశాం. జగనన్న అమ్మఒడి కింద రూ.13,022 కోట్లు, జగనన్న గోరుముద్ద కింద 36.88 లక్షల మందికి రూ.1600 కోట్లు ఇచ్చాం. ఇరిగేషన్ కింద 14 ప్రాజెక్టులు పూర్తి చేశాం. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద 2019-20 ఏడాదికి 52.38 లక్షలమంది రైతులకు 17030 కోట్లు కేటాయించాం. ఇంకా వైఎస్ఆర్ కాపు నేస్తంలో 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల మహిళలకు 5 విడతల్లో రూ.75 వేలు. ఈ ఏడాది 3.2 వైఎస్సార్ కాపు నేస్తం కింద 491 కోట్లు కేటాయించి 3.27 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం 390.74 కోట్లు కేటాయించి నేతన్నలకు 81,783 మంది లబ్ధి చేకుర్చాం. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను బీసీలకు వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం’ అంటూ గవర్నర్ తెలిపారు.
అలాగే వైఎస్సార్ ఆసరా పథకం కింద 87,74,674 మంది మహిళలకు 6792.21 కోట్లు కేటాయించామని, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 8.78 లక్షల మహిళా సంఘాలకు రూ.1399.79 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద 45 నుంచి 60 మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహళలకు 4604.13 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చట్టం చేశామని.. ఒక స్కిల్ వర్శిటీతోపాటు 25 మల్టీ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. కాగా రాష్ట్రంలోని 3 ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహకాలు అందిస్తున్నామని, విజయనగరంలో భోగాపురం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టును ప్రారంభించామని, రాష్ట్రంలో 6 పోర్టులు, 2 ఫిషింగ్ హార్బర్లను రెండు విడతల్లో అభివృద్ధి చేస్తామని గవర్నర్ అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని గవర్నర్ ఈ సందర్భంగా వివరించారు.