థర్డ్ వేవ్ ఎప్పుడు వచ్చినా అందుకు రెడీగా ఉండాలి: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే… ముందస్తుగా థర్డ్ వేవ్ కు సంబంధించిన హెచ్చరికలు మాత్రం అందరినీ కలవరపెడుతున్నాయి. దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలుచేశారు. ఈరోజు కలెక్టర్లతో సమావేశమైన ఆయన.. వివిధ అంశాలపై దిశనిర్దేశం చేశారు. అయితే కోవిడ్ థర్డ్ వేవ్పై ఆయన స్పందిస్తూ.. . థర్డ్వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదు.. కానీ, మనం ప్రిపేర్గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం.. అంటూ వివరించారు. ఆ థర్డ్ వేవ్ ఎప్పుడు వచ్చినా అది ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
అంతేకాకుండా థర్డ్వేవ్లో పిల్లలు ప్రభావితం అవుతారని చెబుతున్నారని.. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అంతేకాకుండా చక్కటి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని చెప్పిన ఏపీ సీఎం.. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. ఇంకా జిల్లాస్థాయిలో వచ్చే 2నెలలకు కార్యాచరణ సిద్ధంచేసి అమలు చేయాలన్న ఆయన.. పిల్లల వైద్యంకోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను తీసుకొస్తున్నామని వివరించారు. కాగా ఆ మూడింటిలో ఒకటి వైజాగ్లో, కృష్ణా–గుంటూరు ప్రాంతంలో ఒకటి, తిరుపతిలో ఒకటి ఏర్పాటుచేస్తామని.. అందుకు సంబంధించి అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాలని వైఎస్ జగన్ సూచించడం విశేషం.