తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్
తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీపై కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్ర అభివృద్ధిలో కూడా అంతే నిబద్ధతతో భాగస్వాములుగా పనిచేస్తున్నారని వీరి అందరి సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి పథకాల ఫలాలు ప్రజలకు విజయవంతంగా అందుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే ఉద్యోగులతో ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధం రీత్యా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని, ఉద్యోగులందరి హక్కులు గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను అభినందిస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇంక్రిమెంట్ ప్రకటించిందని తెలిపారు. అలాగే 2014లో పదో వేతన సవరణ చేస్తూ 43శాతం అత్యధిక ఫిట్ మెంటును ప్రకటించిందని కూడా అన్నారు.
ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడినపడుతున్న సందర్బంగా రాష్ట్రంలోని అందరు ఉద్యోగ, ఉపాధ్యాయులకు వర్తించే విధంగా మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ చేస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. వేతన సవరణ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చేసే పద్ధతిని గత ప్రభుత్వాలు అవలంబించాయని, కానీ.. తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే, క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను, స్థితి గతులను దృష్టిలో పెట్టుకొని, మానవీయ కోణంలో వారి వేతనాలు కూడా పెంచిందని స్పష్టం చేశారు. ఇంకా ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీ.ఆర్.ఏలు, వీ.ఏ.ఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్కు చార్జ్ డ్, డెయిలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ అలా మొత్తం రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కేసీఆర్ వివరించారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పలుదశలుగా సంప్రదింపులు జరిపిన తర్వాతనే ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగా ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టిందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తున్నామని శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తున్నానని వివరించారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 80 శాతం ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియ పూర్తయింని, మిగతా అర్హులైన ఉద్యోగులతోపాటు, అర్హులైన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని 100 శాతం అర్హులైన ఉద్యోగులందరు ప్రమోషన్లు పొందుతారని స్పష్టం చేశారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందని కేసీఆర్ సభలో వివరించారు.