తిరుపతి ఉప ఎన్నిక… రంగంలోకి 8 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చాటిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది వైసీపీ. తిరుపతి ఉపఎన్నికలో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న ఆ పార్టీ.. ఏకంగా ఏడుగురు మంత్రులను రంగంలోకి దింపింది.
అదేవిధంగా పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్లుగా ఏడుగురు మంత్రులను ప్రకటించింది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి పేర్ని నాని, సత్యవేడుకు మంత్రి కొడాలి నాని, గూడూరుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సూళ్లూరుపేటకు మంత్రి కన్నబాబు, సర్వేపల్లికి మంత్రి ఆదిమూలపు సురేష్, వెంకటగిరికి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి మంత్రి గౌతంరెడ్డిలకు పూర్తి బాధ్యతలు అప్పగించింది.
అయికే మొత్తం పార్లమెంట్ ఎన్నికల పూర్తి వ్యవహారాల బాధ్యతలు మాత్రం పార్టీలో కీలక నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాగా తాజాగా తిరుపతి ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించిన వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో రంగంలోకి దిగేందుకు పార్టీ నేతలతో కీలక సమీక్ష నిర్వహించడం విశేషం.