తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్… ఆ గ్రామాల ప్రజలు ఓటు బహిష్కరణ…

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఉపఎన్నిక ఈరోజు ఉదయం 7గంటలకు ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే.. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన ఉపఎన్నికలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు చోట్ల గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు.
ముఖ్యంగా మాజీ మంత్రి బొజ్జల స్వగ్రామం ఊరందూరుతో పాటు నారాయణ గ్రామస్థులు ఎన్నికల్లో ఓటును వేయకుండా బహిష్కరించారు. శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో తమ గ్రామాలను విలీనం ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు ఈ రెండు గ్రామాల్లోని ప్రజలు. గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించడంతో ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు రాకపోవడంతో పోలింగ్ కేంద్రాలు బోసిపోతున్నాయి. ఇప్పటికి ఒక్క ఓటు కూడా పోల్ అవ్వని పరిస్థితి నెలకొంది. ఓటింగ్ బహిష్కరించడమే గాక.. తమ గ్రామాన్ని శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో కలపడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపాలిటీలో తమ గ్రామాన్ని కలపబోమని రాతపూర్వక హామీని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. ఊరందూరు గ్రామంలో 2 వేలపై చిలుకు ఓట్లు ఉండగా… మునిసిపాలిటీలో కలిపే విషయంపై నిరసన చేస్తూ ఓటును బహిష్కరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.