తమిళనాడులో ఓటు వేసిన తెలంగాణ గవర్నర్ తమిళ సై

దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖులు వారి వారి ఓట్లను వినియోగించుకుంటున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఈరోజు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి.
అయితే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఓ రకమైతే… కేవలం తమిళనాడు ఎన్నికల ప్రచారం మరో రకంగా సాగింది. ఈ హోరాహోరీ పోరులో ఎవరు విజేతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారో చూడాలి. కాగా తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమిళనాడులోని కోలీవుడ్ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు. రజనీకాంత్, అజిత్, కమలహాసన్,శృతిహాసన్ వంటి సినీ ప్రముఖులు వచ్చి ఓటు వేసి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. అలాగే రాజకీయ ప్రముఖులు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అదేవిధంగా తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ అయిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఓటు వేయడానికి తమిళనాడు వచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కమ్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.