డోసు పెంచాలని మోడీకి…. వైఎస్ జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో మహమ్మారికి చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీకాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకు నాలుగు రోజులపాటు టీకా ఉత్సవ్ ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్సవ్ లో భాగంగా రోజుకు ఆరు లక్షల మందికి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ లేఖ రాశారు. ‘టీకా ఉత్సవం’ కోసం వెంటనే 25 లక్షల కోవిడ్ డోస్లు పంపించాలని ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసారు సీఎం వైయస్ జగన్. వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్కు సంబంధించి టెస్ట్, ట్రాక్, ట్రేస్ నిర్దిష్ట పద్ధతిలో జరగాలన్న కేంద్రం సూచనలను రాష్ట్రంలో పక్కాగా అనుసరిస్తున్నామని… కోవిడ్ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు, వాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రంలో ఏ లోటూ లేకుండా అమలు చేస్తున్నామని లేఖలో జగన్ స్పష్టం చేశారు. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేకంగా ‘టీకా ఉత్సవం’ నిర్వహించాలన్న కేంద్రం నిర్దేశించడం ఈ ప్రక్రియలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
అదేవిధంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో టీకా ఉత్సవం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని.. టీకా ఉత్సవంలో ప్రతి రోజూ 1140 పీహెచ్సీలు, 259 పట్టణ ఆరోగ్య కేంద్రాల (యూహెచ్సీ) పరిధిలోని 1145 గ్రామాలు, 259 వార్డులలో వాక్సిన్ వేస్తామని వెల్లడించారు. టీకా ఉత్సవంలో ప్రతి రోజూ 6లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశామని… రాష్ట్రంలో ప్రసుత్తం కేవలం 2 లక్షల కోవిడ్ వాక్సిన్ డోస్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మరో రెండు లక్షల డోస్లు వచ్చే వీలుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి అత్యవసరంగా మరో 25 లక్షల కోవిడ్ వాక్సిన్ డోస్ల అవసరమని తెలిపారు. ఈనెల 11వ తేదీ నాటికి అందిస్తే.. ఈ కార్యక్రమాన్ని దేశమంతా గుర్తించే విధంగా నిర్వహిస్తామని.. తక్షణమే రాష్ట్రానికి 25 లక్షల కోవిడ్ వాక్సిన్ డోస్లు పంపేలా ఆరోగ్య శాఖను ఆదేశించాలని వైఎస్ జగన్ ప్రధాని మోడీని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *