ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ డీల్ వీరితోనే…..

టాలీవుడ్ డైరెక్టర ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంగా నడుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పంపిణీ చేసే విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయంలో కాస్త క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. దక్షిణాది భాషల థియేట్రికల్ రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఇంకా గోప్యత పాటిస్తున్నా, ఈ సినిమాను హిందీలో పంపిణీ చేస్తున్న పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం స్పష్టతకు వచ్చాయి.
అదేమంటే… పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో జీ5 సంస్థ స్ట్రీమింగ్ చేస్తుందని వెల్లడించింది. అలాగే హిందీలో మాత్రం నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రసారం చేస్తుందని తెలుస్తోంది. అలానే వరల్డ్ వైడ్ గా ఇంగ్లీష్, పోర్చిగీస్, కొరియన్, తుర్కిష్, స్పానిష్ భాషలలోకీ ‘ట్రిపుల్ ఆర్’ను నెట్ ఫ్లిక్స్ సంస్థ అనువదించి విడుదల చేస్తుందని స్పష్టం చేసింది. ఇంకా శాటిలైట్ విషయానికి వస్తే హిందీ వర్షన్ ను జీ సినిమాకు ఇచ్చిన ఈ సంస్థ, తెలుగు, తమిళ, కన్నడలో స్టార్ ఛానెల్స్ కు అప్పగించినట్లు వెల్లడించింది.
అంతేకాకుండా మలయాళం వర్షన్ శాటిలైట్ హక్కుల్ని ఏషియన్ నెట్ కు ఇచ్చింది. హిందీలో థియేట్రికల్ రైట్స్ ను పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ కు అందించినట్టు తెలిపింది. కాగా ఓ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే అందుకు సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రసార వివరాలు తెలియచేయడం ఈ మధ్య కాలంలో ‘ట్రిపుల్ ఆర్’ విషయంలోనే జరిగాయని చెప్పవచ్చు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళికి, నిర్మాత డీవీవీ దానయ్యకు పెన్ స్టూడియోస్ సంస్థ ధన్యవాదాలు తెలిపింది. మరి ఇదే స్ఫూర్తితో నిర్మాత డీవీవీ దానయ్య దక్షిణాది రాష్ట్రాల హక్కులను ఎవరెవరికి ఇచ్చారనే విషయాన్ని అధికారికంగా తెలియచేస్తారేమో వేచి చూడాల్సిందే. మొత్తానికి చూసుకుంటే…. యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అయ్యేలా ‘ట్రిపుల్ ఆర్’ను రాజమౌళి ఎంతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారనేది స్పష్టం అవుతుంది. చూద్దాం వేచి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *