టీ- ప్రైవేటు టీచర్లకు గుడ్ న్యూస్… రేపటి నుంచే రూ.2వేలు జమ

తెలంగాణలో కరోనా వీర విహారం చేస్తుంది. కరోనా మహమ్మారి, లాక్డౌన్తో ప్రైవేట్ స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు నెలకు రూ. 2000లు, కుటుంబానికి 25 కిలోల బియ్యం చొప్పొన అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడాను. దీంతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు.
అయితే ప్రభుత్వం అందించే ఈ ఆపత్కాలపు ఆసరాకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. మొత్తం 1,18,004 మందిని సాయం కోసం ఎంపికచేశారు. వీరిలో 1,06,383 మంది టీచర్లు, 11,621 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఈ సంఖ్య మరో 10వేల వరకు పెరిగే అవకాశమున్నట్టు కూడా అధికారులు తాజాగా మళ్లీ అంచనా వేస్తున్నారు. కాగా ఎంపికైన వారికి మంగళవారం అంటే రేపటి నుంచే వారి వారి అకౌంట్లలో రూ. 2వేల నగదు సాయం అందించనున్నారు. అలాగే 21వ తేదీ నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరుచేయగా, పౌరసరఫరాలశాఖ 3.625 టన్నుల సన్న బియ్యాన్ని కూడా రెడీ చేసి ఉంచడం విశేషం.