జనసేన కోనసీమ నిరసనకు అనుమతి లేదు….
ఆంధ్రప్రదేశ్ లో కరోనా చాలా తీవ్రంగా విజృంభిస్తుంది. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనాతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అదీ తూర్పు గోదావరి జిల్లాలో కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. రోజు రోజుకు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం పెరుగుతుంది. దీంతో కోనసీమలో ఈరోజు నుంచి మూడు రోజులపాటు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ జనసేన పార్టీ నిరసన దీక్షను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే పోలీసులు ఈ నిరసన దీక్షకు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 144 అమలులో ఉన్నందున పోలీసులు అనుమతి నిరాకరించారు. కాగా కోనసీమలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న చమురు, సహజవాయు సంస్థలు సీఎస్ఆర్ నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని జనసేన డిమాండ్ చేస్తుంది. అలాగే ఆయా సంస్థల కార్యాలయాల వద్ద నిరసన చేపట్టాలని జనసేన పిలుపునివ్వడం విశేషం. మరి ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.