జనసేనకి ఎన్నికల కమిషన్ చెక్
ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన పార్టీ తీవ్ర ఎదురు దెబ్బలను ఎదుర్కొంటుంది. ప్రణాళికాబద్ధంగా రాజకీయాలు చేయకపోవడం, ఒక నిబద్ధత, రాజకీయ పరిపక్వతతో ఎత్తులకు పైఎత్తులు లేకపోవడంతో వరుసగా ప్రతిఘటన ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.
అదేమంటే… మొన్నటికి మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన గుర్తు గాజుగ్లాజును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించేశారు. మరి తాజాగా తెలంగాణలో జనసేనకు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జరగనున్న రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో పోటీలో ఉన్న జనసేన గుర్తు అయిన గాజుగ్లాసు.. తన కామన్ గుర్తును కోల్పోయింది.
అయితే గత ఏడాది జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో 10 శాతం సీట్లకు పోటీ చేయకపోవడంతో జనసేన కామన్ గుర్తును కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శి నిర్ణయంతో జనసేనాని, నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఖంగుతిన్నంత పని అయింది. గ్రేటర్ ఎన్నికల్లో బిజేపితో పొత్తు కారణంగా ఓట్ల చీలిక నివారణకు పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఎస్ఈసీకి పంపించిన లేఖలో జనసేన అధ్యక్షుడు స్పష్టం చేశారు. అలాగే త్వరలో జరిగే రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలలో తాము పోటీ చేయాలని నిర్ణయించడంతో తమ అభ్యర్థులకు గాజుగ్లాస్ కామన్ సింబల్ ను కొనసాగించాలని ఎస్ఈసిని జనసేనాని కోరారు. కానీ జనసేన మొరను ఆలకించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ తిరస్కరించడం విశేషం.