జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం… దేనికి సంకేతం..!
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈమధ్యనే రెండు సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. జగన్ సీఎం అయినప్పటినుంచీ ఎంతో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ చకచకా అభివృద్ది చేసుకుంటూ పోతున్న ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలను అమలు చేస్తుండటం విశేషంగా చెప్పవచ్చు. తాజాగా పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో నాలుగో జేసీ పోస్టును మంజూరు చేసింది ప్రభుత్వం. జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో మరో జేసీ పోస్టుని ఏర్పాటు చేసింది.
అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాల్లో ముగ్గురు జేసీల ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. జేసీ-హౌసింగ్ పోస్టును ఐఏఎస్ కేడర్ అధికారితో భర్తీ చేయాలని ఆదేశించింది.
జేసీ-హౌసింగ్ పరిధిలో ఇంధన, గ్రామీణ మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, ఏపీ ఫైబర్ నెట్, విలేజ్ వార్డు సెక్రటేరీయేట్ శాఖలు ఉన్నాయి. అలాగే నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండడంతో జేసీ-హౌసింగ్ పోస్టు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కాగా ఇళ్ల నిర్మాణం కోసం మొదటి, రెండో విడతల్లో మొత్తంగా రూ. 50,944 కోట్ల మేర ఖర్చు చేయనుంది జగన్ ప్రభుత్వం. మొదటి విడతలో రూ. 22,084 కోట్లతో జూన్ 2022 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా రెండో దశలో 22,860 కోట్లతో జూన్ 2023 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కాగా ఇళ్ల నిర్మాణంతో పాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌళిక సదుపాయాల పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడం విశేషం.