చైనాపై మరోసారి ట్రంప్ కన్నెర్ర…

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఓటమికి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఒకకారణమైతే, ప్రధాన కారణం మాత్రం కరోనా మహమ్మారి అనే చెప్పవచ్చు. అయితే కరోనాను కంట్రోల్ చేయడానికి సరైన నిర్ణయాలు తీసుకోలేదని అమెరికా ప్రజలు ట్రంప్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థపై ఆలోచించిన ట్రంప్, కరోనా కట్టడిలో విఫలం అయ్యారని విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
అయితే అదే సమయంలో ట్రంప్ చైనాపై తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ చైనా నుంచే అమెరికాకు వచ్చిందని, ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం కావడానికి చైనానే కారణం అని పలుమార్లు విమర్శించిన విషయం కూడా విదితమే. అలాగే అమెరికాకు, ప్రపంచానికి చైనా 10 ట్రిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ కూడా చేశారు ట్రంప్. అంతర్జాతీయ సంస్థలు కూడా చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చినట్టు తెలియజేశాయి. దీంతో ట్రంప్ మరోసారి చైనాపై నిప్పులు చెరిగారు. చైనా నుంచే కోవిడ్ వైరస్ వచ్చిందని తాను ముందుగానే చెప్పానని, తప్పనిసరిగా చైనా భారీ మూల్యం చెల్లించాలని ట్రంప్ వివరించారు.